U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

హవ్వ… సింగరేణిలో ఇంత నాసిరకమా…

లక్షలాది రూపాయల పనుల్లో డొల్లదనం.
చోద్యం చూస్తున్న సింగరేణి అధికారులు.

ఉదయం/సింగరేణి. భద్రాద్రి కొత్తగూడెం.
మసిపూసి మారేడు చేస్తున్నట్లుగా లక్షలాది రూపాయల పనుల్లో డొల్లతనం ఇట్టే కనబడుతుంది. మరి నాణ్యతను పరిశీలించే సింగరేణి అధికారులకు ఎందుకు కనబడటం లేదో అర్థం కావడం లేదు. ఈ నాణ్యతలేని పనులు నిర్వహించేది ఎక్కడో దూరంగా ప్రజలు చూడలేని చోటు కాదు. అధికారులు పరిశీలించలేని ప్రదేశం అసలు కానే కాదు. ప్రతినిత్యం ఉదయం సాయంత్రం సింగరేణి అధికారులు సైతం మార్నింగ్ వాకింగ్ కు జాగింగ్ కు వచ్చి గంటలసేపు గడిపే చోటు ప్రకాశం స్టేడియంలోనే ఇదంతా జరుగుతుంది. లక్షలాది రూపాయలతో సింగరేణి సంస్థ కొత్తగూడెంలోని ప్రజలకు ఉపయోగపడే విధంగా స్టేడియంలో జరిగే కార్యక్రమాలను ప్రజలు వీక్షించేందుకు గ్యాలరీలను స్టేడియంలో నిర్మించే టెండర్ ను కాంట్రాక్టర్లకు అప్పగించింది. సదరు కాంట్రాక్టర్ చేస్తున్నాడు లేదంటే సబ్ కాంట్రాక్టర్లకు అప్పచెప్పాడో తెలియదు గానీ ఏమాత్రం నాణ్యత లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలు గాలిలో కలిసిపోయే అవకాశం ఉంది. నాణ్యతలేని ఇసుక ఇటుకలు సిమెంటుతో నిర్మాణాలు చేస్తూ మట్టి ని నింపి ప్రజలు కూర్చునే గ్యాలరీలను నిర్మాణం చేసినా అడిగే నాధుడే కరువయ్యాడు. అంతేకాకుండా గ్రౌండ్ కి వచ్చే ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ఉపకరణాలు సైతం కనీసం ప్రారంభించక ముందే వాటి బేస్మెంట్ కు సంబంధించిన పార్టులు పగిలిపోవడం చూస్తుంటే ఐటమ్స్ ఎంత బలంగా దృఢంగా ఉన్నాయో అర్థం అవుతుంది. ఈ విషయంపై గ్రౌండ్లో పనులను పర్యవేక్షిస్తున్న అధికారులను అడిగితే ప్రారంభించని జిమ్ ఉపకరణాలు పిల్లలు ఎక్కి పాడు చేశారని అందుకే అవి పగిలిపోయాయని సమాధానం చెప్పడం చూస్తుంటే నవ్వొస్తుంది. పిల్లలు ఎక్కితేనే పగిలిపోయింది అంటే అట్టి ఉపకరణాలు వాడటం మొదలుపెడితే ఏమవుతాయో అధికారులకే తెలియాలి. లక్షలాది రూపాయలను ఖర్చుపెట్టి అభివృద్ధి పనులను నిర్వహిస్తున్న సింగరేణి సంస్థలో అందరికీ కనబడే విధంగా నాసిరకమైన నిర్మాణాలు జరుగుతున్న అడిగే నాధుడు లేకపోతే ఎలా. సింగరేణిలో విజిలెన్స్ లాంటి నిఘా సంస్థలు సైతం ఉన్నాగాని ఏమాత్రం భయం లేకుండా నాసిరకమైన పనులను నిర్వహిస్తున్నా ఎవరు చూసేవారు లేరంటే మరి కోట్లాది రూపాయలతో జరుగుతున్న సింగరేణి అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయో అధికారులకి తెలియాలి. ఇప్పటికైనా సదరు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటారా లేదంటే వదిలేస్తారా వేచి చూడాల్సిందే..

Related posts

అబ్రహం భార్య ఆదిమూలపు శైలజ హఠాన్మరణం.

పాల్వంచ ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు..!

పార్టీ నాయకులతో జిల్లా కలెక్టర్ సమావే శం.

Leave a Comment