బఫర్ జోన్ లో భారీ నిర్మాణాలు
చెరువు భూములు సైతం కబ్జా
కనిపించని చెరువు తూము, కల్వర్టు.
బఫర్ జోన్ లో భారీ నిర్మాణం చేపట్టిన కమలం నేత
జిల్లా కలెక్టర్ సాబ్ జర దేకో
భద్రాద్రి కొత్తగూడెం జనవరి 11 ( ఉదయం )
కొత్తగూడెం కేంద్రంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాటుతో గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తూ ఇక్కడి భూములకు రెక్కలొచ్చాయి. దీనితో అనతి కాలంలోనే చుంచుపల్లి మండలంలో వ్యాపారాభివృద్ధికి అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశంగా అభివృద్ధి చెందడంతో భూ కబ్జాలతో పాటు అక్రమ నిర్మాణాలు అనేకం చోటుచేసుకున్నాయి. ఇప్పటికే బఫర్ జోన్ లో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ అండర్ గ్రౌండ్ లో నిత్యం నీటిని తోడుతుండటం కూడా తెలిసిందే. మోటార్లతో నీరు ఎత్తిపోయడం చివరకు లిఫ్ట్ ని బంద్ చేసి పక్కన పెట్టేసిన సంగతి కూడా తెలిసిందే. అయినా గాని గిరిజన చట్టాల నిబంధనలకు విరుద్ధంగా భారీ భవంతులు దర్శనమిస్తున్నాయి. చెరువు భూమి కబ్జా చేయడమే కాకుండా బఫర్ జోన్ ప్రాంతంలో సైతం భారీ భవనాలు నిర్మాణాలు పూర్తి కావొస్తున్నప్పటికి జిల్లా అధికారులకు సమాచారం లేకపోవడం గమనార్హం. చెరువులు , కుంటలను కాపాడుకోవాలని హైడ్రా ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. హైడ్రా రాకతో చెరువులు , కుంటలు , కాలువలు నీటి పరవళ్లతో పూర్వవైభవం చోటు చేసుకుంటుందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. అదేవిధంగా విద్యానగర్ కాలనీ లో చెరువు భూమి కబ్జాకి పాల్పడి నిబంధనలకు విరుద్ధంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడంతో చుంచుపల్లి మండలంలో చెరువు భూమి ని కాపాడాలని బఫర్ జోన్ లో అక్రమంగా నిర్మింస్తున్న భారీ భవనాల తొలగింపుకు హైడ్రా కు పని చెప్పాల్సిందే అంటూ స్థానిక ప్రజలు కోరుకుంటున్న సందర్భాలు నెలకొన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బఫర్ జోన్ ప్రాంతంలో పచ్చదనం పెంపకానికి మాత్రమే అనుమతులు ఉన్నప్పటికి చెరువు భూమి కబ్జా చేసి మరి అక్రమ నిర్మాణాలు చేపట్టడంపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.
బఫర్ జోన్ లో భారీ నిర్మాణం చేపట్టిన కమలం నేత
కమలం నేత కనుసన్నల్లో చెరువు భూమి కబ్జా చేసి మరి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బఫర్ జోన్ లో భారీ నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. చెరువులకు కనీసం 30 మీటర్ల దూరం వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని నిబంధనలు ఉన్నాయని తెలిసినప్పటికీ రాజకీయ అండదండలతో అక్రమ నిర్మాణానికి తెర తీశారు. అక్రమంగా బఫర్ జోన్ లో భారీ భవంతి నిర్మాణం పూర్తి కావొస్తున్నప్పటికి నేటికి మండల అధికారుల యంత్రాంగం కన్నెత్తి చూసే పరిస్థితి అక్కడ లేకపోవడం చూస్తుంటే కమలం నేత ఎంతటి ఘనుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెరువు నుంచి బయటకు వచ్చి అలుగు పారే నీరు ప్రవహించాల్సిన తూములు కల్వర్టులు ప్రస్తుతం కనబడడం లేదంటే అధికారులకే తెలియాల్సి ఉంది….

