తెలంగాణ హాకీ లో శృతి మించిన రాజకీయాలు..
అయిన వారికి అందలం.. అర్హులకు మొండి చేయి.
కేవలం ఎంపికలతో ఈ ఏడాది మమ…
తెలంగాణ హాకీ అసోసియేషన్ లో అన్ని తప్పులే..
సెలక్షన్ కి రాకున్నా క్యాంపులో చోటు.
ఆట రాకున్నా… కావలసిన వారికే క్యాంప్..
ప్రతిభ అక్కర్లేదు… పాలిటిక్స్ చాలు…
గతానికి భిన్నంగా జరుగుతుందంటూ ఆరోపణలు.
అయినా మా ఇష్టం అంటున్న రాష్ట్ర కమిటీ..
తీరు మార్చుకోకపోతే ఆట కనుమరుగే…
ఉదయం/హైదరాబాద్… ..
హాకీ సీనియర్స్ సెలక్షన్స్ లో చాలా తప్పులు జరుగుతున్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమంది ఉదయ్ కుమార్ ఆరోపిస్తున్నారు. శనివారం నాడు హైదరాబాద్ లో జరిగిన సీనియర్ నేషనల్ కు సంబంధించిన టీం ఎంపికలో గోల్మాల్ జరిగిందని సెలక్షన్ కు రాని వారిని అసలు బాల్ హాకీ స్టిక్ పట్టుకోవడం సరిగ్గా రాని వారిని నేషనల్ టీంలోకి తీసుకున్నారని అన్నారు. ఇది తెలంగాణ హాకీ కి సరైన పద్ధతి కాదని ఈ రకమైన రాజకీయ జోక్యంతో నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరుగుతుందని అన్నారు.
మన దేశానికి గర్వకారణమైన హాకీ క్రీడకు తెలంగాణలో చీడ పడుతుందా అని క్రీడాకారులు క్రీడాభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది.. అసలే ప్రభుత్వాల ఆదరణ అంతంత మాత్రమే క్రీడలకు లభిస్తూ ఉంది.. మన దేశానికి వెన్నెముక యువతే అని అందరికీ తెలిసిన విషయమే అటువంటి యువత పెడదోవ పట్టకుండా అన్ని రకాల క్రీడలు మానసికంగా శారీరకంగా రేపటి తరాన్ని తీర్చిదిద్దుతున్నాయి.. కానీ రాజకీయ జోక్యాలతో ఆదరణ లేని నిధులతో క్రీడలు కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు..
ఇప్పటికే తెలంగాణ హాకీ లో రాజకీయాలు శృతి మించి పోతున్నాయి అని పలువురు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం నూతనంగా ఏర్పడిన కార్యవర్గం అర్హులైన క్రీడాకారులకు అన్యాయం చేస్తూ , భజన పరులకు అందలం వేస్తున్నారు అని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. గత ఏడాది వరకు ట్రిపుల్ ఒలంపియన్ , పద్మశ్రీ ముఖేష్ కుమార్ ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించి అందులో ప్రతిభ కనపరచిన క్రీడాకారులను ఎంపిక చేసే సంప్రదాయం ఉండేది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కార్యవర్గం ఇప్పటి వరకు ఒక్క కేటగిరి లో కూడా పోటీలను నిర్వహించకుండా కేవలం ఎంపికలతో మమ అనిపించారు . ఎంపికలలో సైతం అర్హులకు మొండి చేయి చూపిస్తూ, తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల పిల్లలకు మాత్రం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రీడా పోటీలు నిర్వహించి ఉంటే ప్రతి క్రీడాకారుడు తమ ప్రతిభను చాటుకొనేందుకు అవకాశం ఉంటుందని అలా కాకుండా కేవలం ఎంపికలు మాత్రమే నిర్వహించడం వల్ల చాలా మంది అర్హులైన క్రీడాకారులకు అవకాశం లేకుండా పోతోంది అని పలువురు క్రీడాకారులు వాపోతున్నారు .
సీనియర్ సెలక్షన్స్ లో అన్ని తప్పులే…
ఇమంది ఉదయ్ కుమార్..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు …
సీనియర్ సెలక్షన్స్ లో చాలా అవకతవకలు చోటుచేసుకున్నాయి..
సీనియర్ నేషనల్ హాకీ సెలక్షన్స్ కు గత నెల ఆరవ తేదీన హైదరాబాద్ సెలక్షన్స్ కు 90 మందికి పైగా చేరుకున్నారు ఆటగాళ్లు..
తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన వారందరిలో 25 మంది హైదరాబాద్ క్యాంపుకు సెలక్ట్ అయి వచ్చారు. అందులో 18 మందిని నేషనల్ టీంను ఎంపిక చేశారు.. అంతా గోల్మాల్ గానే ఎంపిక జరిగింది. అన్యాయంగా ఒక్క హైదరాబాదు నుంచే ఏడుగురుని సెలెక్ట్ చేయడమే కాకుండా సెలక్షన్ కే హాజరు హాజరు కాని వారికి 25 మంది ఉండే క్యాంపులో చోటు దక్కడం 18 మంది టీం నేషనల్ లో సెలెక్ట్ అయిపోవడం చూస్తుంటే ఎంపికలో ఎంత పారదర్శకత పాటించారు అర్థం అయిపోతుంది. ఒక జిల్లా హాకీ అసోసియేషన్ సెక్రటరీ కొడుకు హాకీ స్టిక్, బాల్ సరిగా పట్టుకోవడం రాకపోయినా సెలెక్ట్ చేశారు.
ఫిట్నెస్ సరిగా లేదని వంకతో కావాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన ఏకైక క్రీడాకారుడికి అన్యాయం చేస్తున్నారు. గతంలో మా క్రీడాకారుడు సీనియర్ నేషనల్ కు సెలెక్ట్ అయిన గాని మ్యాచ్ క్యాన్సిల్ కావడంతో అవకాశం చేజారిపోయింది. ఇప్పుడు మరోసారి ఫిట్నెస్ వంకతో అన్యాయం చేస్తే సహించేది లేదు. రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అన్నట్లుగా ఎంపిక ఉండాలి.
అసలు టీం ఎంపికలో పారదర్శకత లేదు.
సెలక్షన్స్ పారదర్శకత తోటే నిర్వహించామని చెబుతున్న రాష్ట్ర హాకీ అసోసియేషన్ మొదటి నుంచి వివాదాలను మూటగట్టుకుంటూనే ఉంది. ఏడాది కాలం నుంచి ఎక్కడ టోర్నమెంట్స్ ను నిర్వహించలేదు. సీనియర్ హాకీ టోర్నమెంట్ నిర్వహించేందుకు ఆదిలాబాద్ జిల్లా ముందుకు వచ్చినా గాని హైదరాబాదులోనే జరుపుతామంటూ రాష్ట్ర కమిటీ చెప్పడం చూస్తుంటే కావాలని తమకు సంబంధించిన వారికి సెలక్షన్ కట్టబెట్టేందుకు నిర్వహించినట్లుగా క్రీడాకారులు చర్చించుకుంటున్నారు. అసలు టోర్నమెంట్ నిర్వహించకుండా 90 మందితో సెలక్షన్ ఏర్పాటు చేయడం ఒక తప్పైతే అసలు 90 మందిలో సెలక్షన్ కు రాని వ్యక్తిని క్యాంపుకు తీసుకొని ఆ టీంకు సెలెక్ట్ చేయడం, మహబూబ్నగర్ కు చెందిన క్రీడాకారుడికి ఏమాత్రం ఆట రాకున్నా లాబీయింగ్ తో స్థానం కల్పించడం చూస్తుంటే తెలంగాణ హాకీ అసోసియేషన్ పారదర్శకత ఏమాత్రం ఉందో అర్థం అయిపోతుంది. వెంటనే టీం ఎంపిక లో జరిగిన పొరపాట్లను సరిదిద్ది సరైన ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని లేకుంటే ఇది తెలంగాణ హాకీ కి మాయని మచ్చగా మిగిలిపోతుందని తెలంగాణలోని హాకీ క్రీడాకారులు వాపోతున్నారు.

