కాల్వ భూమిని కలిపేసుకుని గోడ కట్టిన వైనం..
రాష్ట్రీయ రహదారిని కట్ చేసి ధ్వంసం..
చోద్యం చూస్తున్న ప్రభుత్వాధికారులు..
కబ్జాదారులకు కలిసి వస్తున్న ఏజెన్సీ చట్టాలు…
ఏజెన్సీ ని అడ్డుపెట్టుకొని కోట్ల స్థలం కబ్జా…
ఉదయం/ భద్రాద్రి కొత్తగూడెం.
కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లుగా పక్కవాడి భూమిని కాదు ప్రభుత్వ కాలువని సైతం కబ్జా చేసి గోడను నిర్మించాడు. అంటే ప్రభుత్వ అధికారులు కబ్జారాయుడికి కొమ్ముకాస్తున్నారా లేదంటే.. ఏజెన్సీ చట్టాల లోసుగులను ఉపయోగించుకొని అధికారంలో ఉన్న పెద్దల అండదండలతో మిలాఖత్ అవుతున్నాడో తెలియదు..
వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నంద తండా గ్రామ పంచాయతీకి చెందిన హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలో కోట్ల రూపాయల విలువగల గిరిజనేతరుల పేరున ఉంది .పంచాయితీలో ఏళ్ల తరబడి పన్ను కడుతూ వస్తున్న సదరు గిరిజనేతరుడి భూమిని దొడ్డి దారిన ఏజెన్సీ చట్టాలను అడ్డుపెట్టుకొని కబ్జా చేసిన ప్రబుద్ధుడు ఏకంగా అక్కడ పెట్రోల్ బంక్ ని నిర్మాణం చేశాడంటే ఏజెన్సీ చట్టాలు ఏ మేరకు దుర్వినియోగం అవుతున్నాయో అర్థం అవుతుంది.. చేసేది లేక సదరు గిరిజనేతరుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో దాని పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ కాలువకు అనుసంధానంగా ఉన్న భూమిని సైతం చదును చేసి గోడను నిర్మాణం చేసి తన ఆక్రమణలో ఉంచుకున్నాడు.. అంతేకాకుండా సదరు పెట్రోల్ బంకుకు వాహన రాకపోకలు సాగించేందుకు రాష్ట్రీయ రహదారిని సైతం రాత్రి కి రాత్రి డివైడర్లతో సహా పెకలించి రోడ్డును ధ్వంసం చేసి తనకు అనుకూలంగా రోడ్డు నిర్మాణం చేసుకున్నాడు.. ఇంతవరకు రాష్ట్రీయ రహదారిని ధ్వంసం చేసి డివైడర్లను తొలగించిన సదరు పెట్రోలు బంకు యజమానిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో రహదారులు మరియు భవనాల శాఖకు సంబంధించిన అధికారులకే తెలియాలి.
కాలువ స్థలాన్ని కబ్జా చేసిన నేపథ్యంలో గతంలో అప్పటి చుంచుపల్లి ఎమ్మార్వో సైతం ఆగ్రహం వ్యక్తం చేసి పనులు ఆపిన సంఘటనలు లేకపోలేదు. కానీ కబ్జారాయుడు మాత్రం అధికారులు మారిన అనంతరమే తన పనిని చకచగా కానిచ్చేసాడు. కాల్వకు సంబంధించిన ప్రభుత్వ భూమికి సైతం గోడను కట్టి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడు సదరు ప్రబుద్ధుడు.
ఇప్పటికైనా ప్రభుత్వ రెవిన్యూ అధికారులు, ఆర్ అండ్ బి శాఖకు సంబంధించిన అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు.. ఏ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే…

