నిబందనలు పాటించని ఇటుక బట్టీల అనుమతులు రద్దు చేయండి…
జీ వో నెం 80 కచ్చితంగా అమలు చేస్తూ అందుకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఇటుకబట్టీల అనుమతులను వెంటనే రద్దు చేస్తూ అట్టి వివరాలు లోకాయుక్తకు సమర్పించాలని పెద్దపల్లి ఆర్ డి వో ను లోకాయుక్త ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. ఇన్వెస్ట్ గేషన్ అధికారి బి. జనార్దన్ రెడ్డి సమర్పించిన రిపోర్ట్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. 2021 లో రంగాపూర్ గ్రామానికి చెందిన బాలసాని వెంకటేశం పెద్దపల్లి చుట్టు పక్కల గ్రామాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఇటుకబట్టీల పై పిర్యాదు చేయగా కేసు పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అధికారుల తప్పుడు రిపోర్థుల పై అసంతృప్తి చెందిన ధర్మాసనం గత నెలలో ఇటుకబట్టీల కేసును లోకాయుక్త ఇన్వెస్ట్ గేషన్ విభాగనికి అప్పగించింది. ఈ నేపథ్యంలో లోకాయుక్త ఆదేశాలతో గతంలో పెద్దపల్లి తో సహా ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో డిఎస్పి గా పనిచేసి ప్రస్తుతం లోకాయుక్త వరంగల్ రీజనల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న బి. జనార్దన్ రెడ్డి రంగంలోకి దిగి గుట్టుచప్పుడుగకుండా విచారణ జరిపి లోకాయుక్త ధర్మాసనం కు రిపోర్ట్స్ సబ్మిట్ చేశాడు. నిజానిజాలను పరిశీలించిన ధర్మాసనం ఇన్వెస్ట్ గేషన్ రిపోర్టను సమర్దిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

