ఖమ్మంపాడులో మైనర్ బాలిక అదృశ్యం
ఆచూకీ కోసం పోలీసుల గాలింపు
పెద్దమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు
అశ్వారావుపేట, ఉదయం న్యూస్(నవంబర్ 11): అశ్వారావుపేట మండలం ఖమ్మంపాడు గ్రామంలో మైనర్ బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. తల్లి పదేళ్ల క్రితమే మరణించగా, తండ్రి కూడా పట్టించుకోకపోవడంతో బాలికను ఆమె పెద్దమ్మ చిచ్చోడి చంద్రమ్మ చేరదీసి పెంచుకుంటోంది. ఈ క్రమంలో నవంబర్ 6వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో తన పెద్దమ్మ కుమారుడైన కోనే సీతారామయ్య ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. రాత్రి గడిచినా బాలిక ఇంటికి చేరకపోవడంతో బంధువులు, తెలిసిన ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో ఆందోళన చెందిన పెద్దమ్మ చిచ్చోడి చంద్రమ్మ అశ్వారావుపేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన ఎస్ఐ బి. సాయి కిషోర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ఆచూకీ గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. తల్లిని కోల్పోయి పెద్దమ్మ సంరక్షణలో పెరుగుతున్న బాలిక కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. బాలిక క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు వెంటనే అశ్వారావుపేట పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.

